Letter from the Prime Minister
     
     
  ప్రియమైన నా దేశ ప్రజలారా,  
     
  శక్తి, ఉత్సాహం నిండిన దీపావళి పర్వదినం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చిన రెండో దీపావళి ఇది. ధర్మాన్ని నిలబెట్టమని శ్రీరాముడు మనకు బోధిస్తారు. అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ధైర్యాన్నిస్తారు. దీనికి సరైన ఉదాహరణను కొన్ని నెలల క్రితం.. ఆపరేషన్ సిందూర్ సమయంలో మనం చూశాం. ఆ సమయంలో ధర్మాన్ని నిలబెట్టడమే కాకుండా.. మనకు జరిగిన అన్యాయానికి తగిన రీతిగా బుద్ధి చెప్పాం.  
     
  ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. దేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా అనేక జిల్లాల్లో మొదటిసారి దీపాలు వెలగబోతున్నాయి. ఇవన్నీ నక్సలిజాన్ని, మావోయిస్టు తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసిన ప్రాంతాలు. రాజ్యాంగంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. హింసా మార్గాన్ని వదిలి.. ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి వచ్చిన ఎంతో మంది వ్యక్తులను ఇటీవలి కాలంలో మనం చూశాం. ఇది దేశానికి చాలా పెద్ద విజయం.  
     
  ఈ చారిత్రక విజయాల నేపథ్యంలోనే కొత్త తరం సంస్కరణలను సైతం మన దేశం అమల్లోకి తీసుకొచ్చింది. నవరాత్రుల మొదటి రోజునే తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ ‘‘జీఎస్టీ పొదుపు ఉత్సవం’’లో వేల కోట్ల రూపాయలను ప్రజలు ఆదా చేస్తున్నారు.  
     
  వివిధ సంక్షోభాల్లో ప్రపంచం చిక్కుకున్న తరుణంలో.. స్థిరత్వానికి, బాధ్యతకీ ప్రతీకగా మన దేశం ఆవిర్భవించింది. అతి త్వరలో.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం.  
     
  వికసిత (అభివృద్ది చెందిన), ఆత్మనిర్భర భారత్ (స్వావలంబన సాధించిన భారత్) దిశగా చేస్తున్న ప్రయాణంలో.. దేశం పట్ల మన విధులను నిర్వర్తించడమే పౌరులుగా మన ప్రాథమిక బాధ్యత.  
     
  ‘‘స్వదేశీ’’ (స్థానిక ఉత్పత్తులు)ను స్వీకరించి.. ‘‘ఇది స్వదేశీ!’’ అని గర్వంగా చెబుదాం. ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’’ స్ఫూర్తిని ప్రచారం చేద్దాం. అన్ని భాషలను గౌరవిద్దాం. పరిశుభ్రంగా ఉందాం. మన ఆరోగ్యానికి ప్రాధాన్యమిద్దాం. మన ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం మేర తగ్గిద్దాం. యోగాను స్వీకరిద్దాం. ఇవన్నీ మనల్ని ‘‘వికసిత్ భారత్’’ లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తాయి.  
     
  ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినప్పుడు దాని కాంతి ఏమాత్రం తగ్గదు. పైగా మరింత పెరుగుతుందని దీపావళి మనకు బోధిస్తుంది. అదే స్ఫూర్తితో సమాజంలో, పరిసరాల్లో సామరస్యం, సహకారం, సానుకూలత అనే దీపాలను ఈ దీపావళికి మనం వెలిగిద్దాం.
మరోసారి..మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
 
     
  మీ,
నరేంద్ర మోదీ.
 
  Letter from the Prime Minister  
     
   
     
  ఈ లేఖను మీకు నచ్చిన భాషలో చదవండి.  
     
 
English हिंदी ગુજરાતી ଓଡ଼ିଆ ਪੰਜਾਬੀ தமிழ் मराठी తెలుగు বাংলা മലയാളം অসমীয়া ಕನ್ನಡ اردو মণিপুরী नेपाली Khasi भोजपुरी मैथिली
 
     
     
       
 
प्रधानमंत्री श्री नरेंद्र मोदी से जुड़ें   ప్రధాని మోదీతో కనెక్ట్ అవ్వండి
नवीनतम जानकारी के लिए माईगव विज़िट करें।   తాజా అప్‌డేట్‌ల కోసం మైగవ్ ని సందర్శించండి